రేపటి నుంచే ఆర్టీసీ ఛార్జీల పెంపు.. పెరిగిన చార్జీల వివరాలు ఇవే
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచనున్నట్టు ఇటీవలే ఏపీ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పెంచిన ఛార్జీలు రేపటి నుంచే అమలులోకి రానున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ స్పష్టంచేసింది. ఈమేరకు సవరించిన చార్జీల వివరాలను తెలియజేస్తూ.. ఏపీఎస్ఆర్టీసీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచనున్నట్టు ఇటీవలే ఏపీ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పెంచిన ఛార్జీలు రేపటి నుంచే అమలులోకి రానున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ స్పష్టంచేసింది. ఈమేరకు సవరించిన చార్జీల వివరాలను తెలియజేస్తూ.. ఏపీఎస్ఆర్టీసీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించిన వివరాల ప్రకారం... పల్లెవెలుగు బస్సుల్లో కి.మీ.కు 10 పైసలు పెంపు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో కి.మీ.కు 20 పైసలు పెంపు వర్తించనుంది. అలాగే, ఇంద్ర, గరుడ, అమరావతి బస్సుల్లో కి.మీ.కు 10 పైసలు చార్జీ పెంచినట్టు ఆర్టీసీ తెలిపింది. వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఎటువంటి ఛార్జీల పెంపు లేదు. అలాగే, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ 11 స్టేజీల వరకు ఛార్జీల పెంచడం లేదని ఆర్టీసీ వెల్లడించింది.
పల్లెవెలుగులో కూడా మొదటి 2 స్టేజీలు లేదా 10 కి.మీ. వరకు ఛార్జీల పెంపుదల లేదని.. ఆ తర్వాత కిమీ 10 పైసలు పెంచినట్టు ఆర్టీసీ తాజా ప్రకటనలో పేర్కొంది. తదుపరి 75 కి.మీ. వరకు రూ.5 ఛార్జీ వర్తించనున్నట్టు ఆర్టీసీ ప్రకటన స్పష్టంచేసింది. గత నాలుగేళ్లలో డీజిల్ ఛార్జీలు రూ.49 నుంచి రూ.70కి పెరిగాయని.. డీజిల్ ధరల పెంపు వల్ల సంస్థకు ఏటా రూ.630 కోట్ల అదనపు భారం పడుతుండగా.. విడిభాగాలు, సిబ్బంది జీతభత్యాల రూపంలో ఏటా మరో రూ.650 కోట్ల భారం ఆర్టీసీపై పడుతోందని.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకే ఆర్టీసీ చార్జీలు పెంచామని ఆర్టీసీ అధికారులు స్పష్టంచేశారు.