ఏపీ టెట్ 2018 ఫలితాలు విడుదల
ఉపాధ్యాయ అర్హత రాత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి.
ఉపాధ్యాయ అర్హత రాత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విశాఖపట్టణంలోని డా.వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో విడుదల చేశారు. ఏపీ టెట్‌లో 57.48 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అభ్యర్థులు results.apcfss.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఏపీ టెట్ ఫలితాలతో పాటు ఏపీ టెట్ ర్యాంక్ కార్డు, ఏపీ టెట్ మార్కుల జాబితాను మంత్రి విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టెట్ పరీక్షను మూడు భాగాలు-పేపర్ l, పేపర్ 2ఎ, 2బిగా నిర్వహించింది.
1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే అర్హత ఉన్న అభ్యర్థులకు జూన్ 10 నుంచి జూన్ 12 వరకు పేపర్ 1, ఆపై తరగతులకు బోధించే అర్హత ఉన్న అభ్యర్థులకు జూన్ 13 నుండి జూన్ 19 వరకు పేపర్ II (ఎ), జూన్ 21న పేపర్ II (బి)ను నిర్వహించారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే అర్హత ఉన్న అభ్యర్థులు పేపర్ I, పేపర్ II రెండూ రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో టెట్ 2018 నిర్వహించారు. ఈసారి టెట్ పరీక్ష రాసిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్ పై ఫలితాలు కనిపించాయి. మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,576 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2,13,042 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్-1లో 69.36 శాతం, పేపర్-2ఏ సోషల్‌లో 45.1 శాతం, 2ఏ గణితం, సైన్స్‌లో 42.33 శాతం, 2ఏ లాంగ్వేజెస్‌లో 57.27శాతం, పేపర్ 2బీ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 54.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది టెట్ పరీక్షకు హారైనవారు అధికం.
ఏపీ టెట్ 2018 ఫలితాల కోసం
- అభ్యర్థులు aptet.apcfss.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- APTET Results 2018 లింక్ మీద క్లిక్ చేయండి.
- Results-APTET, MAY 2018 అనే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నింపి గెట్ రిజల్ట్స్ బటన్‌పై క్లిక్ చేయండి.
- ఫలితాలను చూసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్‌అవుట్ తీసుకోండి.
ఆగస్టులో డీఎస్సీ
ఇప్పటికే డీఎస్సీ షెడ్యూల్‌ను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జులై 6న జారీ కానుంది. దీనిద్వారా ఏపీలోని మొత్తం 10,351 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. జులై 7 నుంచి ఆగస్టు 9వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్టు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 23 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. సెప్టెంబర్ 10న డీఎస్సీ ఫైనల్ 'కీ', సెప్టెంబర్ 15న ఫలితాలను విడుదల చేయనున్నారు. పీఈటీ, డాన్స్, మ్యూజిక్ మినహా మిగతా అన్ని విభాగాలకు సంబంధించి డీఎస్సీ సిలబస్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.