అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా ఉత్పత్తిలో నాణ్యత పెరగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రొయ్యల రైతులకు విద్యుత్ సరఫరా భారం తగ్గిస్తూ రూ.2కే యూనిట్ విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ సహా ఇతర మౌలిక వసతులకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని రైతులు, ఎగుమతిదారుల సమావేశంలో తెలిపారు. అటు ఇప్పటివరకు చెల్లిస్తున్న మొత్తం కంటే కిలోకు రూ.30 అధికంగా ఇచ్చేందుకు రొయ్యల ఎగుమతిదారులు సీఎం ఎదుట అంగీకరించారు.


పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాముఖ్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్‌ వినియోగించడం మంచిది కాదని.. పర్యావరణహితంగా వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఆక్వా సాగు సరికాదన్నారు. కోస్తాంధ్రలో ఆక్వారంగాన్ని, రాయలసీమలో ఉద్యానరంగాన్ని ప్రోత్సహించామన్నారు. ఆక్వా రైతులు బాగుండాలనే విద్యుత్‌ ధరలు తగ్గించామని..ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి రైతులు సహకరించాలన్నారు. రైతులు సహకరించినప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.