విశాఖపట్టణం: అరకులోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్‌, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఆదివారం మధ్యాహ్నం డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద జరిగిన మావోల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో అరకు మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన అనుచరులు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు.. ఇటీవలే వైసీపీ నుంచి తెదేపాలోకి చేరారు. గతంలోనూ పలుమార్లు మావోయిస్టులు కిడారిని బెదిరించారు. కాల్పుల ఘటనతో విశాఖ ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.


కాగా ఇటీవల కాలంలో ఏజెన్సీలో మావోలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్న మావోయిస్టులు.. ప్రజా ప్రతినిధులను టార్గెట్‌ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే కిడారి సర్వేశ్వరరావుని టార్గెట్ చేసినట్లు సమాచారం.


కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ నిర్ధారించారు. ఈ దాడిలో దాదాపు 50మంది మావోలు పాల్గొన్నట్టు సమాచారం.


కాగా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.