Athmakuru Bypoll: నేడే ఆత్మకూరు ఉపఎన్నిక.. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు బైపోల్..
Athmakuru Bypoll 2022: మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఇవాళ ఉపఎన్నిక జరగనుంది.
Athmakuru Bypoll 2022: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇవాళ (జూన్ 23) ఉపఎన్నిక జరగనుంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. నేటి ఉదయం 7గం. నుంచి సాయంత్రం 6గం. వరకు ఆత్మకూరులో పోలింగ్ జరగనుంది. అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,400 మంది ఓటర్లు ఉండగా.. 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో 363 ఈవీఎం, 391 వీవీప్యాట్స్‌ను ఉపయోగించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తో పాటు వెబ్‌క్యాస్టింగ్ చేయనున్నారు. మొత్తం 1409 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు :
ఆత్మకూరు ఉపఎన్నికలో 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో అధికార వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ తరుపున భరత్ కుమార్ పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేనలు ఇక్కడ అభ్యర్థిని నిలపలేదు. బీఎస్పీతో పాటు పలువురు ఇండిపెండెంట్లు ఉపఎన్నికలో పోటీ చేస్తున్నారు.
ఉపఎన్నికలో గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. సానుభూతితో పాటు సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరులో 22,276 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి ఆ మెజారిటీ పెరుగుతుందా.. తగ్గుతుందా చూడాలి. టీడీపీ, జనసేన బరిలో లేకపోవడంతో వైసీపీ వ్యతిరేక ఓటు గంప గుత్తగా తమ ఖాతాలోనే పడుతుందని బీజేపీ భావిస్తోంది. అయితే ఉపఎన్నికలో ఆ పార్టీ ఎంత మేర సత్తా చాటగలదో చూడాలి.
దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ :
దేశవ్యాప్తంగా ఇవాళ 3 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ జరగనుంది. పంజాబ్‌లోని సంగ్రూర్, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, అజంఘడ్ లోక్‌సభ స్థానాలతో పాటు ఢిల్లీలోని రాజేంద్రనగర్, త్రిపురలోని బర్దోవలి, అగర్తలా, సుర్మా, జుబరాజ్‌నగర్, ఏపీలోని ఆత్మకూరు, జార్ఖండ్‌లోని మందర్ అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది.
Also read: Directions and Idols: ఇంట్లో దేవతల విగ్రహాల్ని ఏ దిశలో ఉంచాలి, వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook