జగన్‌పై దాడి కేసు.. అప్పుడే కత్తి కొనిపెట్టుకున్న శ్రీనివాస రావు
జగన్‌పై దాడి కేసులో విచారణ ముమ్మరం
వైజాగ్ విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస రావు నుంచి పోలీసులు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ కేసు విచారణలో స్వయంగా పాల్గొన్న వైజాగ్ సీపీ మహేష్ చంద్ర లడ్డా విచారణ అనంతరం ఆ వివరాలను మీడియాకు వివరించారు. దాడి ఘటన అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు తావిచ్చేలా మారిందన్న సీపీ లడ్డా.. గత మూడు రోజులుగా శ్రీనివాస రావుని వీలైనన్ని కోణాల్లో విచారించినట్టు తెలిపారు. శ్రీనివాస రావుకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను పరిశీలించాం. అతడితోపాటు అదే క్యాంటిన్‌లో కలిసి పనిచేస్తున్న తోటి సిబ్బందిని ప్రశ్నించగా జనవరిలో నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్షీలు ఏర్పాటు చేయించిన విషయం కూడా వాస్తవమేనని తెలుసుకున్నట్టు సీపీ తెలిపారు.
జనవరిలోనే కోడికత్తిని కొనుగోలు చేసి హోటల్ కిచెన్‌లో పెట్టుకున్నాడని తోటి సిబ్బంది ద్వారా తెలుసుకున్నట్టు సీపీ లడ్డా చెప్పారు. ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ యజమాని సహా నిందితుడు శ్రీనివాస రావుతో పాటు కలిసి పనిచేస్తున్న వారిని కూడా విచారిస్తున్నామని సీపీ లడ్డా మీడియాకు వెల్లడించారు.