బీఎడ్ అభ్యర్థులకు శుభవార్త. సెకండరీ గ్రేడ్‌ టీచర్(ఎస్‌జీటీ) పోస్టులకు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం పరిధిలోని జాతీయ విద్యా బోధన మండలి(ఎన్‌సీటీఈ)గెజిట్‌ జారీ చేసింది. బీఎడ్ పూర్తి చేసినవారు షరతులతో ఎస్జీటీ పోస్టులకు అర్హులే అని తాజా ప్రకటనలో తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్‌జీటీగా నియామకం అయిన వారు రెండేళ్లలోపు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 6 నెలల ఎలిమెంటరీ బోధన బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. గతంలో బీఈడీ చేసినవారు కేవలం పాఠశాల సహాయకులు(ఎస్‌ఏ) పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండేవారు. గతంలో బీఈడీ కోర్సు పూర్తి చేసిన వారు స్కూల్‌ అసిస్టెంట్‌కు మాత్రమే అర్హులు.. ఎస్‌జీటీ అవకాశం ఉండేది కాదు. కేవలం డీఎడ్ పూర్తి చేసిన వారికే ఎస్‌జీటీ అవకాశం ఉండేది. కాగా తాజా ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ఇప్పుడు డిగ్రీలో 50 శాతం మార్కులు, బీఈడీ చేసినవారు ఎస్‌జీటీ, పాఠశాల సహాయకుల పోస్టులకు(స్కూల్ అసిస్టెంట్) దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌తో బీఈడీ పూర్తి చేసిన వారు హర్షం వ్యక్తం చేస్తుండగా డీఎడ్‌ అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో త్వరలో జారీ కానున్న డీఎస్సీపై ఈ గెజిట్‌తో తీవ్ర ప్రభావం పడనుంది.


2010లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2012 డీఎస్సీ నుంచి ఎస్‌జీటీ పోస్టులను వందశాతం డీఈడీ చేసినవారితోనే భర్తీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం 10,351 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది. వీటిలో ఎస్‌జీటీ పోస్టులు 4,967 వరకు ఉన్నాయి. టెట్‌ పరీక్షను కూడా ఎస్‌జీటీలు, పాఠశాల సహాయకులకు విడివిడిగా నిర్వహించింది. బీఈడీ చేసినవారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షనే రాశారు. ఇప్పుడు ఎన్‌సీటీఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ కారణంగా బీఈడీవారు ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది. టెట్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.