Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం ఎప్పుడు పూర్తవుతుంది, ప్రత్యేకతలేంటి
Bhogapuram Airport: ఏపీలో రెండు కీలకమైన ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాంద్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఇక ప్రారంభమై మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోనుంది. పూర్తి వవరాలు ఇలా ఉన్నాయి.
Bhogapuram Airport: అంతర్జాతీయ స్థాయిలో నిర్మితం కానున్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి 4,592 కోట్లు ఖర్చు కానుంది. 2,203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితం కానున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలేంటి, ఎప్పటికి ప్రారంభం కావచ్చనేది తెలుసుకుందాం..
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ను మరింతగా విస్తరించేందుకు నేవీ నుంచి అడ్డంకులున్న నేపధ్యంలో సమీపంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరమేర్పడింది. ఇందుకు గత ప్రభుత్వం భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించ తలపెట్టింది. అప్లట్లోనే శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభం కాలేదు. ఏ విధమైన అనుమతులు, నో అబ్జక్షన్ సర్టిఫికేట్లు లభించలేదు. ఆ తరువాత అధికారంలో వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం భోగాపురంపై ప్రత్యేక దృష్టి సారించింది. కారణం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా నిర్ణయించడమే.
అందుకే అప్పట్నించి భోగాపురం విమానాశ్రయం పనులపై దృష్టి పెట్టింది. ముందుగా భూసేకరణ పూర్తి చేసింది. ఆ తరువాత టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జీఎంఆర్‌కు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఎన్‌వోసీ, వివిధ రకాల అనుమతులే కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులోని న్యాయ వివాదాలు పరిష్కరించింది. ఇప్పుడు జీఎంఆర్ అధినేత సమక్షంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. రెండున్నరేళ్లలో అంటే 2026 జనవరి నాటికి తొలి విమానం ల్యాండ్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతలు
ఈ విమానాశ్రయం పూర్తయితే ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే వీలుంటుంది. తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించనున్నారు. పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్ గ్రూపుతో ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయాణీకులకు ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం, విశాఖ, శ్రీకాకళం జిల్లా ప్రజలు నేరుగా టెర్మినల్ చేరుకునే సౌకర్యాలున్నాయి.
ఇవి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎగ్జిట్ గేట్ వే కోసం కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్, తొలిదశలో 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కార్గో అభివృద్ధి ఉంటుంది. పూర్తి ఆధునిక పరిజ్ఞానంతో రన్ వే, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసెంజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్ వంటివి ఉంటాయి.
మరోవైపు 16వ నెంబర్ జాతీయ రహదారిని కలుపుతూ రోడ్డు నిర్మాణముంటుంది. కమర్షియల్ డెవలప్ మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హోలింగ్ సౌకర్యాలుంటాయి. విశాఖపట్నం-భోగాపురం మధ్య 6300 కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్ల మేర 6 లైన్ల రహదారి నిర్మాణముంటుంది.
Also read: AP Job Notifications: నిరుద్యోగులకు శుభవార్త, 3 నెలల్లో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు, సిలబస్‌లో మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook