టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు ఆశోక్ గజపతిరాజు, సుజనా చౌదరీల రాజీమానాకు ఆమోదం లభించింది. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి వారి రాజీనామాలకు ఆమోదం తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నిన్న (గురువారం ) అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరీ పీఎం కార్యాలయానికి తమ రాజీనామా లేఖలను పంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవధిలో ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య ఫోన్ సంభాషణ జరగడం.. అనంతరం మోడీ వారి రాజీనామాలను రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వారి రాజీనామాలకు ఆమోదం లభించింది. 


విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ-బీజేపీ సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. దీనికి తోడు  ప్రత్యేక హోదాపై బుధవారం జైట్లీ వ్యాఖ్యనించిన తీరు.. ప్రధాని మోడీ ఫోన్ అపాయింట్ మెంట్ దొరక్కపోవడం వంటి పరిణామాలతో కలత చెందిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మోడీ కేబినెట్ నుంచి తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు రాజీనామా చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు కేంద్ర మంత్రులుగా ఉన్న ఆశోక్ గజపతిరాజు, సుజనా చౌదరీలు రాజీనామా సమర్పించారు.