`చలో అసెంబ్లీ`.. ముందస్తు అరెస్టులు
ప్రత్యేక హోదా కోరుతూ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు విజయవాడలో 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీకీ ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలోని హామీల అమలు కోరుతూ ప్రత్యేకహోదా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 'చలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగా పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. కాగా ఈ కార్యక్రమానికి వైఎస్సాఆర్సీపీ మద్దతునిచ్చింది.
ఇదిలా ఉండగా.. ఎన్ని అరెస్టులు, నిర్బంధాలు జరిగినా ఈనెల 20న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం జరిగి తీరుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ప్రత్యేక హోదా కోసమే ఈ చలో అసెంబ్లీ ర్యాలీ చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం గళమెత్తితే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ప్రత్యేకహోదా సాధన సమితి ప్రతినిధి శివాజీ అన్నారు. విజయవాడలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.