ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెబుతూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ రోజు ఉదయం నుండి రాత్రి 11 గంటల వరకు ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగ్గా..  ఆ చర్చలో భాగంగా పలువురు ఎంపీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రసంగించారు. తాను ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నానని.. అయినా 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ప్రత్యేక హోదా విషయంలో ఏమీ చేయలేనని.. ప్యాకేజీ కావాలంటే ఇస్తామని తెలిపారు. తెలుగ తల్లి స్ఫూర్తిని కాపాడాలన్నదే తన అభిమతమని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని ప్రసంగం తర్వాత రైట్‌ టు రిప్లైలో భాగంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడారు. ప్రధాని డ్రామాలు ఆడుతున్నారని.. ఆయన చెబుతున్నవన్నీ అవాస్తవాలన్నీ.. బ్లాక్ బస్టర్ చిత్రంలో నటిస్తున్నట్లు నటిస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించగా.. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 325 సభ్యులు, అనుకూలంగా 126 సభ్యులు ఓట్లు వేయడంతో.. తీర్మానం వీగిపోయింది. ఈ ఓటింగ్ తర్వాత సభాపతి సభను సోమవారానికి వాయిదా వేశారు. 


అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. "ప్రధానమంత్రి చులకన చేసేలా మాట్లాడారు. వారి మాటలు మమ్మల్ని బాధపెట్టాయి. నేను యూటర్న్ తీసుకున్నానని అన్నారు. అవిశ్వాసం పెట్టినవారికి అహంకారం ఉందని కూడా తెలిపారు. కానీ ప్రధానికే అహంకారం ఉందని అనుకుంటున్నాం. మాకూ, తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా ఆయన మాట్లాడారు. ఏపీ అసలు భారతదేశంలోనే ఉందా అన్నట్లు ఆయన మాటలు మాకు తోచాయి. న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రధాని పై ఉందా లేదా అన్న సందేహం మాకు కలుగుతుంది. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇన్ని పార్టీలు కలిసి రావడం ఇదే తొలిసారి" అని చంద్రబాబు తెలిపారు.