అమరావతి ప్రాంతానికి చెందిన ఓ రైతుపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆగ్రహాన్ని ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. తుళ్లూరు మండలం వెంకటపాలెం పల్లెటూరులో ఏపీ ప్రభుత్వం తరఫున జలసంరక్షణ పేరుతో రైతుల మీటింగ్‌‌ నిర్వహించారు. ఆ సభకు హాజరైన రామాంజనేయులు అనే రైతు సీఎంతో తన గోడు వెల్లబోసుకుంటూ.. ఇటీవలే ఓ వ్యక్తి పార్కింగ్ విషయంలో తనపై దాడి చేశాడని.. పోలీసులకు చెబితే ఎవరూ పట్టించుకోలేదని తెలిపాడు. దీనిపై స్పందించిన చంద్రబాబు వెంటనే ఎంక్వయరీ చేసి సమస్యను పరిష్కరించమని అధికారులకు తెలిపారు.


అయితే రామాంజనేయులు కాస్త ఉద్వేగంతో అమరావతిలో రైతులకు రోజు రోజుకీ రక్షణ లేకుండా పోతుందని అనడంతో చంద్రబాబు ఆ రైతుపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడే సమయం కాదని ఆ రైతుకి హితవు పలికారు. అందరికీ క్రమశిక్షణ అనేది ఉండాలని.. ఆ రైతు సమస్య పరిష్కరిస్తానని.. కాకపోతే సభలో గొడవ చేయడం, అమర్యాదగా మాట్లాడడం మంచిది కాదని చంద్రబాబు అన్నారు. అయినా ఆ రైతు వినకుండా గట్టిగా అరుస్తూ ఏవేవో మాట్లాడడంతో.. సహనం కోల్పోయిన చంద్రబాబు తన సమస్య ఏంటో చెప్పాలి తప్పితే.. అసందర్భంగా మాట్లాడవద్దని హితవు చెప్పారు.