న్యూఢిల్లీ: ఏప్రిల్ 11న ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు తలెత్తాయని, పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తే, ఇంకొన్ని చోట్ల హింసపెచ్చుమీరిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయమే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అక్కడ తమ పార్టీ నేతలతో కాసేపు మంతనాలు సాగించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర ఎన్నికల విభాగం అధికారులపై ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేయడంలో చూపించిన ఉత్సాహం రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగేలా చూపలేదని ఈ సందర్భంగా చంద్రబాబు ఇసి ముందట వాపోయారు. 


ఎన్నికల సంఘాన్ని కలిసి తన నిరసన వ్యక్తంచేసిన చంద్రబాబు.. పనిలోపనిగా ప్రధాని నరేంద్ర మోదీపై సైతం తన విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం అధికారులు పనిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.