న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపి అగ్రనేత అరుణ్‌ జైట్లీ పార్థివదేహానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన చంద్రబాబు నాయుడు.. అక్కడి నుంచి నేరుగా కైలాష్‌ నగర్‌లోని జైట్లీ నివాసానికే వెళ్లి అక్కడ ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అరుణ్ జైట్లీ మృతితో దేశం ఒక మేధావిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా అరుణ్‌ జైట్లీతో తనకు చాలా సాన్నిహిత్యం ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం కోసం పాటుపడిన అరుణ్ జైట్లీ.. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్నేహితుడిగా సాయం చేశారని తెలిపారు. విద్యార్థి సంఘాల నాయకుడి నుంచి జైట్లీ అంచలంచలుగా జాతీయ స్థాయి నేతగా ఎదిగారని గుర్తుచేశారు. 


చంద్రబాబుతో కలిసి అరుణ్ జైట్లీకి నివాళులు అర్పించిన వారిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత మోతిలాల్ ఓహ్రా, ఆర్ఎల్‌డి నేత అజిత్ సింగ్, ఎన్సీపీ నేతలు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ తదితరులు ఉన్నారు.