విశాఖపట్టణంలో నేటి నుంచి సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. వైజాగ్ లో ఈ సదస్సు జరగడం ఇది మూడోసారి.  2016, 2017సంవత్సరాల్లో నిర్వహించిన రెండు సదస్సుల్లో 11 లక్షల కోట్ల విలువైన 876 ఎంఓయులు జరిగాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంతవరకూ వీటిలో 156 సంస్థలు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని, ఆది, సోమవారాల్లో మూడు రోజులపాటు జరిగే పెట్టుబడుల సదస్సుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు భాగస్వామ్య సదస్సులో పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ ప్రభుతోపాటు తొమ్మిది మంది కేంద్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. దేశ, విదేశీ ప్రతినిధులు 2వేలకు పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సులో రూ.3 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. జపాన్‌, దక్షిణ కొరియాల నుంచి ప్రత్యేకంగా పారిశ్రామిక బృందాలు వస్తున్నాయి.


ఈ సదస్సులో తొమ్మిది ప్లీనరీ సెషన్లు, ఎనిమిది సెక్టోరల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏరోస్పేస్‌ అండ్ డిఫెన్స్, వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల తయారీ‌, ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, విద్యుత్‌, బయో టెక్నాలజీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కోళ్ల, మత్స్య పరిశ్రమలు, పెట్రోలియం అండ్‌ పెట్రో కెమికల్స్‌, రిటైల్‌, టెక్స్‌టైల్‌, పర్యాటక రంగం తదితర రంగాల్లో ఒప్పందాలు జరగనున్నాయి.