YS Jagan: కోవిడ్19పై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం.. కీలక ఆదేశాలు
కోవిడ్19 పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపానల్ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్ డెస్క్ కచ్చితంగా ఉండాలని, ఆరోగ్య మిత్రలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు.
అమరావతి : రాష్ట్రంలో కోవిడ్19 పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రులలో సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఇంకా ఖాళీగా ఉన్నాయన్న అధికారులు సీఎంకు తెలిపారు. కొన్ని పత్రికలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతిరోజూ రూ. 10.18 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మెడిసిన్ కోసం రూ. 4.57 కోట్లు, కోవిడ్ టెస్టులకు రూ. 4.3 కోట్లు, పేషెంట్లకు ఆహారానికి రూ.1.31 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఎంపానల్ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్ డెస్క్ కచ్చితంగా ఉండాలని, ఆరోగ్య మిత్రలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చే యత్నం చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రుపై చేస్తున్న తరహాలోనే అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఎంపానల్డ్ ఆస్పత్రులపై సమీక్ష చేయాలన్నారు. సరైన వైద్యం అందని రోగులను సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రలదేనని సీఎం పేర్కొన్నారు.
‘పతిరోజూ అధికారులు కాల్ సెంటర్లకు మాక్ కాల్ చేసి పనితీరును పరిశీలించాలి. ప్రతి మాక్ కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలి. ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలికసదుపాయాలు.. ఈనాలుగు అంశాల మీద రోగులనుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. వీటిద్వారా ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలి. కొత్త వైద్య కళాశాలల నిర్మాణంకోసం వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్య వ్యవస్థను కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు బలోపేతం చేస్తాయని’ ఏపీ సీఎం వైఎస్ జగన్ కోవిడ్19 సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు.