కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు అని మరోసారి గట్టిగా నిలదీశారు కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి. శుక్రవారం రాజ్యసభలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి అని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఇదే సభలో అందరూ ఉన్నారనే విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆ హామీలని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి మాత్రం ఎందుకు వుండదని సూటిగా ప్రశ్నించారామె. అయినా ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి అడ్డం వస్తున్న సమస్య ఏంటో చెప్పాలని ఈ సందర్భంగా రేణుకా చౌదరి పట్టుపట్టారు. 


ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే, కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పరిగెత్తించేందుకు అవసరమైన నిధులు అన్నీ కేంద్రమే సమకూరుస్తుంది. అదే కానీ జరిగితే ఏపీపై ఆర్థిక ఇబ్బంది, ఒత్తిడి ఎంతో తగ్గుతుంది. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు పోరాటం సాగిస్తున్నారు. అయితే, ఈ క్రమంలోనే ఏపీని సాటి సోదర రాష్ట్రంగా భావిస్తూ తెలంగాణకు చెందిన ఎంపీలు సైతం కేంద్రానికి వ్యతిరేకంగా తమ వాదన వినిపించడం ఆసక్తికరమైన పరిణామం. మొన్న లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి, నిన్న కల్వకుంట్ల కవిత, ఇవాళ రాజ్యసభలో రేణుకా చౌదరి చేసిన వాదనలు అందులో భాగమే.