ఇరు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తూ ఒకరు ఓటుకు నోటు కేసు గురించి ఆలోచిస్తుంటే.. మరొకరు ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఆలోచిస్తున్నారని.. ఈ క్రమంలో ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేశారని సీపీఎం జాతీయ కార్యదర్శి నారాయణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓటుకి నోటు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌‌ను కూడా అరెస్టు చేయాలని నారాయణ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రెండు కేసుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్దదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే బీజేపీ నేత అమిత్ షా పై కూడా నారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. నయీం బతికుండి ఉంటే కొన్ని ముఖ్యమైన రహస్యాలు బయటకు వచ్చేవని.. అవే గనుక బయటకు వస్తే అమిత్ షా కూడా జైలుకి వెళ్లేవాడని నారాయణ తెలిపారు. ఆ తప్పులు కప్పిపుచ్చడానికే అమిత్ షా కనుసైగల్లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్త డ్రామాను తెరపైకి తీసుకొస్తున్నారని నారాయణ ఆరోపించారు.


అలాగే ప్రధాని మోదీ సైతం మైనింగ్ మాఫియా చేసిన వారికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల కాంస్య విగ్రహాలను వరంగల్ పోచమ్మ మైదానంలో ఆవిష్కరించే కార్యక్రమానికి వచ్చిన నారాయణ అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో దేశం అవినీతి మయంగా తయారైంది అని ఆయన అన్నారు. వైఎస్ జగన్‌ని కూడా తక్కువ అంచనా వేయలేమని.. ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు కూడా తక్కువ కాదని ఆయన అభిప్రాయపడ్డారు