దూసుకొస్తున్న బుల్‌బుల్ తుఫాను.. తూర్పు తీర ప్రాంతాల్లో హై అలర్ట్
దూసుకొస్తున్న బుల్‌బుల్ తుఫాను.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్
పూరి: ఒక తుఫాన్ ప్రభావం పోకముందే మరో తుఫాన్ దూసుకొస్తూ తీర ప్రాంతాలను వణికిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు అరేబియా సముద్రం నుంచి తీరంవైపు కదులుతూ వచ్చిన మహా తుఫాన్ ప్రభావంతో దక్షిణాదిన పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవగా తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. మరో 24 గంటల్లో తుఫాన్‌గా మారి, నవంబర్ 9 నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిషా వైపు నుంచి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు పయణిస్తోన్న ఈ తుఫాన్‌కు బుల్‌బుల్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం అండమాన్ దీవులకు పశ్చిమ వాయవ్య దిశగా 390 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. బుల్ బుల్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ తీర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోనూ అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ సర్కార్ సైతం బుల్‌బుల్ తుఫానుపై అప్రమత్తతో వ్యవహరిస్తోంది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 14 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించిన ఒడిషా సర్కార్.. ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికలను గమనిస్తూ పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆ 14 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. బుల్‌బుల్ తుఫాన్‌పై ఒడిషా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా మీడియాతో మాట్లాడుతూ.. 'బుల్‌బుల్ తుఫాన్ ఒడిషా తీరాన్ని తాకకుండా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంవైపు వెళ్లవచ్చు కానీ తుఫాన్ ప్రభావంతో ఉత్తర ఒడిషాలోని తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని అన్నారు.