విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వరుస తుఫాన్లు వెంటాడుతున్నాయి. రెండు నెలల క్రితం తిత్లి తుఫాన్, ఇటీవల గజ తుఫాన్ మిగిల్చిన నష్టం మర్చిపోకముందే తాజాగా ఈ రెండు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరికి మరో తుపాను గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం రాగల 12 గంటల్లో తుఫాన్‌గా మారి తీర ప్రాంతాలపై విరుచుకుపడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చెన్నైకి 800 కిమీ, మచిలీపట్నంకు 930 కిమీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. గంటకు 11 కిమీ వేగంతో తీరం వైపు దూసుకొస్తున్న వాయుగుండం ఈనెల 17న కాకినాడ-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 100-120 కిమీ వేగంతో గాలులు వీయడంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది.


ఈ వాయుగుండం కారణంగా సముద్రంలో 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. ఏపీలోని అన్ని ఓడరేవులకు అధికారులు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలోని అన్ని విభాగాల అధికారులు ఆర్టీజీఎస్ సూచనల మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.