రాహుల్ గాంధీ , చంద్రబాబు మధ్య జరిగిన చర్చ వివరాలు
ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురు నేతల మధ్య తెలంగాణలో సీట్ల సర్దుబాటు అంశంతో పాటు జాతీయ రాజకీయాలపై చర్చ జరిగింది. ఇరువురి మధ్య బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చలు జరిగాయి. ఈ భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు చర్చల వివరాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాహుల్ గాంధీతో చర్చలు ఫలప్రదంగా సాగాయన్నారు. ఈ భేటీలో జాతీయ రాజకీయలపై చర్చ జరిగిందని.. భాజపాకు వ్యతిరేకంగా అన్ని రాజకీయపార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. విభజన సమస్యల పరిష్కారానికి కూడా రాహుల్ మద్దతిచ్చారని..ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారని వెల్లడించారు.
బీజేపీని ఎదుర్కొందుకు ఉమ్మడి కార్యాచరణ - చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిందని...ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, ఐటీ, గవర్నర్ వ్యవస్థ.. ఇలా అన్ని వ్యవస్థలూ సంక్షోభంలో కూరుకుపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము కాంగ్రెస్ తో జతకలిశామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో సానుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు. దేశాన్ని కాపాడదాం.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం’’ అనే నినాదంతో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని చంద్రబాబు స్పష్టంచేశారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామన్నారు.
బీజేపీని ఓడించేందుకు తమతో టీడీపీ కలిసిరావడం శుభపరిణామం - రాహుల్
చంద్రబాబుతో భేటీ గురించి రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను కాపాడమే లక్ష్యంగా తమ భేటీ మంచి వాతావరణంలో సాగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపైనే చర్చించినట్టు రాహుల్ తెలిపారు. బీజేపీని ఓడించేందుకు తమతో టీడీపీ కలిసిరావడం శుభపరిణామం అని ఏఐసీసీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గతంలో తమ పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. తాము పాత విషయాల జోలికి పోవడంలేదన్నారు. గతన్ని మరిచి భాజపాను ఓడించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.
కుదిరిన పొత్తు, కొలిక్కివచ్చిన సీట్ల సర్దుబాటు
రాహుల్ తో జరిగిన భేటీలో చంద్రబాబు తెలంగానలో మహాకూటమి పై చర్చ జరిగింది. పొత్తు,సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీకి 15 సీట్లు ఇవ్వాలని చంద్రబాబు కోరగా.. 14 సీట్లు ఇచ్చేందుకు రాహుల్ గాంధీ అంగీకరించినట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
భేటీలో పాల్గొన్న నేతలు వీరే ..
రాహుత్ తో భేటీ సందర్భంలోచంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, కనమేడల రవీంద్ర బాబు, కంభంపాటి రామ్మోహన్ తదితరులు ఉన్నారు. ఈ భేటీలో జరిగిన సమయంలో రాహుల్ గాంధీ వెంట కొప్పుల రాజు, అహ్మద్ పటేల్ తదితరులు ఉన్నారు.