ముగిసిన ప్రచార గడువు: ఓటర్లకు చంద్రబాబు చివరి విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు ముగిసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో టీడీపీ నేత, ఏపీ సీఎం చంద్రబాబు చివరి సారిగా ఓటర్లకు బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గత పాలనలో తాను అమలు చేసిన సంకేమ పథకాలు, అభివృద్ధి గురించి జనాలకు వివరించారు. తన గత ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. రాష్ట్రం అభివృద్ధి బాటలో శరవేగంగా పయనిస్తోందన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత వేగంగా పయనించాలన్న మరో సారి టీడీపీకి ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చివరి సారిగా విజ్ఞప్తి చేశారు. పిల్లల భవిష్యత్తు తన బాధ్యతగా స్వీకరిస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు
జగన్ వస్తే అంధకారమే...
ఈ సందర్భంగా చంద్రబాబు ...వైసీపీ చీఫ్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని.. అభివృద్ధి సాధ్యం కాదన్నారు. పోలవరం, అమరావతిని అడ్డుకోవడానికి జగన్ ప్రయత్నించారని చంద్రబాబు విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ , ప్రధాని నరేంద్ర మోడీ పేర్లను ప్రస్తావిస్తూ జగన్ కు ఓటు వేస్తే ఏపీ ప్రయోజనాలకు అడ్డుతగుతున్న కేసీఆర్ కు ఓటు వేసినట్లేనని తెలిపారు. జగన్ ను ఓటు వేస్తే ఏపీకి తీరని అన్యాయం చేసిన నరేంద్ర మోడీకి ఓటు వేసినట్లేనని చంద్రబాబు పేర్కొన్నారు. మోడీ , కేసీఆర్ లకు తోడైన జగన్ కు ప్రజలే బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఓటర్లను కోరారు. జగన్ కు ఓటు వేస్తే రాష్ట్రం అంధకారం..టీడీపీకి ఓటు వేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. కాబట్టి తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేయాలని ఈ సందర్బంగా చంద్రబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.