ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది. రాష్ట్రాన్ని ఎకో ఫ్రెండ్లీ స్టేట్‌గా మార్చి.. విద్యుత్ మోటార్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి తాము ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ విషయానికి సంబంధించి ముందు ఆ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరగాల్సిన అవసరం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వచ్చే ఐదేళ్ళలో దాదాపు 5 లక్షల ఎలక్ట్రిక్ మోటార్ వాహనాలను తయారీ చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించడానికి నిశ్చయించుకున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే ఒకవేళ ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు గానీ ప్రారంభమైతే దాదాపు లక్షమందికి ఉపాధి కూడా కల్పించవచ్చని తెలిపారు.


ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా తాము ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో వాడే వాహనాలను కూడా త్వరలో ఈ-వెహికల్స్‌గా మార్చేందుకు తాము ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ తమ ఆసక్తిని బయటపెట్టడంతో ఇప్పుడు ఏపీ విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ హబ్‌గా మారే అవకాశముందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.