ఎమ్మెల్సీగా గాలి సరస్వతమ్మ ఏకగ్రీవం..!
చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సతీమణి సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికకు మార్గం సుగమమైంది.
చిత్తూరు: చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సతీమణి సరస్వతమ్మ ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని మే 7వ తేదిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించే అవకాశం ఉంది.
గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండు నెలల క్రితం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది, కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ నెల చివర్లో ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయగా.. టీడీపీ తరఫున గాలి ముద్దు కృష్ణమనాయుడు సతీమణి సరస్వతమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సంప్రదాయాల ప్రకారంగా విపక్షాలు.. గాలి సతీమణికి మద్దతుగా పోటీకి నామినేషన్ దాఖలు చేయలేదు. అయితే మస్తాన్ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. కానీ, శుక్రవారం నాడు మస్తాన్ రెడ్డి కూడా నామినేషన్ విత్‌డ్రా చేసుకోగా.. ఈ స్థానానికి బరిలో ఉన్న వారిలో టీడీపీ అభ్యర్థి గాలి సరస్వతమ్మ ఒక్కరే ఉన్నారు. దీంతో ఈ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. ఈ నెల 7వ తేదిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.