అనంతలోఉద్రిక్తత; రోడ్డుపై బైఠాయించిన జేసీ
అనంతలో ఉద్రిక్తత; 144 సెక్షన్ విధింపు
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొడమలలో నిన్న వినాయక నిమజ్జనం సమయంలో జరిగిన గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న నిమజ్జనం సందర్భంగా గ్రామస్థులకు, ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహాకులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో వాహనాలకు, బండల పరిశ్రమకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో 12 మంది గాయపడ్డారు. ఇవాళ పెట్రోల్ బాటిళ్లు విసురుకుంటూ దాడికి యత్నించడంతో.. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కానీ పరిస్థితి మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు.
విషయం తెలుసుకున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో జేసీ గ్రామం శివార్లలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. గ్రామంలో ఇంత విధ్వంసం జరుగుతున్నా పోలీసులకు పట్టదా? అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? అని ఆయన మండిపడ్డారు. ఓ వైపు గ్రామస్థులు రాళ్లు రువ్వడంతో పాటు, మరోవైపు ఎంపీ నిరసనలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనపై కలెక్టర్ జి.వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. సంయుక్త కలెక్టర్-II సుబ్బరాజు ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎస్పీ స్వయంగా వెళ్లి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. ఘర్షణపై కేసు నమోదు చేసి పలువురిని అదుపులో తీసుకున్నారు.