ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూజివీడు ఐఐఐటి క్యాంపస్‌లో నిర్వహించిన "వనం మనం" ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మిషన్ హరితాంధ్ర అనేదే తమ లక్ష్యమని.. 127 రోజుల్లో రాష్ట్రంలో దాదాపు 26 కోట్ల మొక్కలను నాటాలని తాము అనుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రతీ ప్రభుత్వ ఆఫీసు అధికారులు కూడా ఈ హరితాంధ్ర కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పౌరులు కూడా మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణ దిశగా కార్యక్రమాలు చేపడుతూ ఆ విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే తాను సంతోషిస్తానని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. "వనం మనం" ప్రోగ్రాంలో భాగంగా ప్రజలు పర్యావరణ హితంతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని.. ఆ విధంగా భావితరాలకు ప్రేరణను అందించవచ్చని తెలిపారు. 


ఐఐఐటి క్యాంపస్‌లో నిర్వహించిన "వనం మనం" ప్రోగ్రాంలో సీఎం తన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌తో కలిసి మొక్కలు నాటారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో పార్టీ  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పర్యావరణాన్ని పరిరక్షించాలని చెబుతూ ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో కచ్చితంగా మొక్కలను పెంచాలని.. ఆ బాధ్యతను ప్రతీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.