సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశిస్తే, తాను ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా వున్నాను అని అన్నాడు ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్. సినిమాల్లోకి రాకముందు మిమిక్రీ చేసే రోజుల్లో నుంచే టీడీపీకి సన్నిహితంగా మెదులుతూ వస్తున్న వేణు మాధవ్ ఇకపై జనసేన పార్టీకి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం పవన్ కల్యాణ్‌ని కలిసేందుకు జనసేన పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన వేణు మాధవ్ అక్కడ ఆయన లేరని తెలుసుకుని నిరాశగా వెనుతిరుగుతూ మీడియాతో చేసిన వ్యాఖ్యలే ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జన సేన పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన వేణు మాధవ్.. "పవన్ ఆదేశిస్తే, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేయడానికి తాను సిద్ధంగా వున్నాను" అని తన మనసులో మాటను బయటపెట్టాడు. ప్రతీ సంవత్సరం పవన్ కల్యాణ్‌కి కొత్త ధాన్యం ఇవ్వడం, ఆయన తన తోటలోని మామిడి పండ్లు తనకు పంపడం జరుగుతుందని, అందులో భాగంగానే ఇవాళ కొత్త ధాన్యం ఇవ్వడానికి ఇక్కడకు వచ్చానని తన రాక వెనుకున్న కారణాన్ని వెల్లడించాడు వేణు మాధవ్.


ఇదిలావుంటే నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఓ ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్న వేణు మాధవ్.. పవన్ కల్యాణ్ గురించి స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ టీడీపీకే మద్ధతు ఇస్తారని అన్నారు. అందుకు కారణం పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని తాను భావించకపోవడమే అని పవన్ స్థాపించిన జనసేన గురించి వేణు మాధవ్ చాలా తేలిగ్గా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే.