2019 ఎన్నికల్లో జనసేన పార్టీ స్టాండ్‌ ఏంటో చెబుతానని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరులో జరిగే జనసేన ఆవిర్భావ సభలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. 2014లో నన్ను వాడుకుని వదిలేశారనే భావిస్తున్నానని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీలు నన్ను రాజకీయాల్లో చిన్నపిల్లవాడినని అనుకుంటున్నాయేమోనని అభిప్రాయపడ్డారు. జనసేన ఇంకా ఎన్డీఏతో ఉందో లేదో నాకు తెలియదన్నారు. కేంద్రమంత్రులు ఇప్పుడు రాజీనామా చేసి ఏం లాభం అని ప్రశ్నించారు. మాఫియా వాళ్లు మాట ఇస్తే నిలబడతారని, కానీ  రాజకీయనాయకులు మాత్రం మాటపై నిలబడరన్నారు. తాను చాలా ప్రాక్టికల్‌గా వ్యక్తినని, సీఎం అభ్యర్థిని అని ఎలా చెబుతానన్నారు. ఈ నెల 14న అన్ని ప్రశ్నలకు బదులు ఇస్తానని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొందరు థర్డ్ ఫ్రంట్ అధికారం కోసమని అనుకుంటున్నారని, థర్డ్ ఫ్రంట్ అధికారం కోసం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. స్వతంత్రంగా వ్యవహరించేందుకు థర్డ్‌ ఫ్రంట్‌ అవసరమన్నారు. దక్షిణాదే కాకుండా జిగ్నేష్‌ లాంటి వాళ్లు కూడా కలిసొస్తారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం గుజ్జర్ల, తెలంగాణ ఉద్యమం తరహాలో జరగాలని పవన్‌ అన్నారు. హోదా ఉద్యమానికి జేఏసీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయి నేతలంతా పార్టీలకతీతంగా కలిసిరావాలన్నారు.


ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేయకుంటే ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య తేడాలొస్తాయని.. ఇలాగే కొనసాగితే మరో 20ఏళ్లలో ద్రవిడ ఉద్యమం మళ్లీ వస్తుందని ప్రధానితో చెప్పానన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే అభివృద్ధి చేయలేదని ఏపీ ప్రభుత్వం అంటోందని, ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పనందునే నిధులు ఆపామని కేంద్రం అంటోందని అన్నారు.


బలమైన వ్యక్తి ఏదైనా చేస్తారనే ప్రధాని మోదీకి మద్దతు పలికానని.. కానీ ఈ రోజు తాను నిరాశ పడ్డానని పవన్‌ అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌ గాంధీ చెప్పడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. తప్పు చేశామనే భావన కాంగ్రెస్‌లో వచ్చిందనుకుంటున్నానని అన్నారు. కేంద్రంతో గొడవలు పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనుకోవాలి అని ప్రశ్నించారు.