ఆ రోజు రాజకీయాల నుండి తప్పుకుంటా: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం
2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ కనీసం ఒక సీటు గెలిచినా సరే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు.
2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ కనీసం ఒక సీటు గెలిచినా సరే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలని ఆయన అన్నారు. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ప్రధాని అనడం భావ్యం కాదన్నారు. నిజం చెప్పాలంటే.. ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్న నాయకుడు కేవలం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అబద్ధాలతో, అవాస్తవాలతో ఏపీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటే తాము చూస్తూ ఊరుకోమని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి తాము ఎంత దూరమైనా వెళ్తామని.. ఎలాంటి ధర్మ పోరాటమైనా చేస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్‌తో పాటు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై కూడా ఛలోక్తులు విసిరారు. అవిశ్వాస తీర్మానం జరుగుతున్న సందర్భంలో జగన్ వీధుల్లో తిరుగుతూ ఉంటే.. పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్టులు పెట్టడంలో బిజీగా ఉన్నారని తెలిపారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా కేఈ కృష్ణమూర్తి కొనసాగుతున్నారు. కేఈ కృష్ణమూర్తి 1978, 1983, 1985, 1989, 2009, 2014 సంవత్సరాలలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.