హైదరాబాద్: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఈ ప్రభావంతో గుంటూరు, నల్గొండ, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు చోట్ల వేగంగా గాలులు వీచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. 


ఇదిలావుంటే, ఇప్పటికే గత మూడు రోజులుగా తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ లోకి ఇన్ ఫ్లో పెరుగుతుండగా.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీలోకి వరద నీరు వచ్చి చేరుతోంది.