బీజేపీ పార్టీ ఏపీలో బలపడేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది. పార్టీ అధిష్టానం ఓ వైపు రాష్ట్ర పార్టీ బలోపేతానికి సంస్థాగతమైన మార్పులు చేస్తూనే.. మరోవైపు రాష్ట్ర ప్రజల సెంటిమెంటు, భావోద్వేగాలకు అనుగుణంగా నడుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈమేరకు రాయలసీమలో పట్టుకోసం కడప ఉక్కు ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్రలో విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అలానే ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. పార్టీ నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాష్ట్ర సందర్శనకు వచ్చి ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ మోదీ రాక ఆలస్యమైతే.. ముందు పార్టీ నేతల ద్వారా ప్రకటించి ఆ తరువాత శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రధానిని తీసుకురావాలనే ఆలోచన కూడా చేస్తున్నారు.


కడపలో ఉక్కు కర్మాగార సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం నియమించిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందం గత బుధవారం కేంద్ర ఉక్కుశాఖకు తన నివేదికను అందజేసినట్లు తెలిసింది.అలానే ఒడిశా అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తగిన ఏర్పాట్లు చేస్తూనే విశాఖ రైల్వేజోన్‌ ప్రకటించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. వీటి ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బలపడాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది.


ఇప్పటికే రాయలసీమ వెనుకబాటుతనంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని రాయలసీమ డిక్లరేషన్‌ పేరిట పలు అంశాలపై బీజేపీ ఆందోళన బాటపట్టింది. ఇదే సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇచ్చిన నిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ప్రత్యేక హోదా కన్నా మెరుగైన ప్యాకేజీ ద్వారా నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు చెపుతున్నారు.


ఏప్రిల్‌ 6న పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధానిని రాష్ట్ర పర్యటనకు తీసుకురావాలనే ఆలోచనలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఉంది. ఒక వేళ మోదీ రాకపోతే అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, రామ్‌మాధవ్‌లను రప్పించి ప్రకటించనున్నారు.  ఆ తరువాత ప్రాజెక్టుల శంఖుస్థాపన కార్యక్రమాలకు ప్రధాని మోదీని పిలిపించాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. కాగా.. బీజేపీ వ్యూహాలపై  తెదేపా నిశితంగా దృష్టిసారించినట్లు తెలిసింది.