AP: ఏపీ మూడు రాజధానుల వ్యవహారంపై హైకోర్టు ( Ap High Court ) లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు విన్పించిన ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే చేసిన వాదనలు ఆసక్తికరంగా సాగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధాని కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచనల్ని గత ప్రభుత్వం వినలేదని..వాస్తవానికి కమిటీ నివేదికకు ముందే అమరావతిని ( Amaravati Capital Issue ) రాజధానిగా నిర్ణయించారని దుష్యంత్ దవే కోర్టుకు నివేదించారు. గత రాజధానిని నిర్ణయించింది ప్రభుత్వం అనేకంటే రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు కలిసి ప్రకటించారని దుష్యంత్ దవే ( Dushyant dave ) తెలిపారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సైతం వ్యాపారులు, రాజకీయ వేత్తలు తప్ప నిపుణులు లేరని చెప్పారు. 


రాజధాని నిర్ణయమనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని..గతంలో ఎక్కడా కేంద్రం జోక్యం చేసుకోలేదన్నారు. మూడు రాజధానుల నిర్ణయం ( Ap three capital decision ) వెనుక విస్తృత ప్రయోజనాలున్నాయన్నారు. నిర్ణయాన్ని ఆపే దిశగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని కోరారు. ప్రజా ప్రయోజనాలున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ( Ap Government ) నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం తగదని దుష్యంత్ దవే స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా మూడు రాజధానుల్ని ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను సైతం గత ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. 


పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు  ( CRDA Abolition act ) చట్టాల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ జయసూర్యల ధర్మాసనం విచారణ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే..రాష్ట్ర ప్రభుత్వ హక్కుల్ని లాక్కోవడమే అవుతుందని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తెలిపారు.


Also read: Grama Sachivalayam Recruitment: ఇక నెలకోసారి ఉద్యోగాల భర్తీ