గుంటూరు ఈస్ట్ టీడీపీ అభ్యర్ధిగా సినీనటుడు అలీ ?
అలీ పొలిటికల్ పోటీ చేసే నియోజకవర్గంపై కొంత వరకు క్లారిటీ వచ్చింది
సినీ నటుడు అలీ ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం చర్చనీయంశంగా మారింది. అలీ పొలిటికల్ ఎంట్రీపై గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..అలాగే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేఫథ్యంలో వరుసగా రెండో సారీ చంద్రబాబుతో భేటీ కావడంతో ఆయన టీడీపీలో చేరుతున్నారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
చంద్రబాబు ముందు అలీ ప్రతిపాదన ?
ఆదివారం చంద్రబాబుతో భేటీ అనంతరం అలీ మాట్లాడుతూ తాను మర్వాదపూర్వకంగా కలిశానంటున్నప్పటికీ ..భేటీ వెనక వేరే ఉద్దేశం ఉందనే కోణంలో రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. గుంటూరు అసెంబ్లీ సీటును అలీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో మైనారిటీలు ఉన్న నేపథ్యంలో టీడీపీ టికెట్ తనకు ఇవ్వాలని చంద్రబాబు ముందు అలీ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధుల కోసం టీడీపీ అన్వేషణలో ఉంది. పైగా ఈ సీటు ఎప్పటిలాగే మైనార్టీలకే కేటాయించాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. దీంతో ఈ సీటు ఇచ్చే విషయంలో చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఎప్పటి నుంచో గుంటూరుపై కన్నేసిన అలీ
గతంలో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ తనకు గుంటూరు ఈస్ట్ లేదా విజయవాడ వెస్ట్ లేదా తన స్వస్థలం రాజమండ్రి సీటులో ఏదో ఒక దానిలో పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడ వెస్ట్ లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జలీల్ ఖాన్ ఉండటం..రాజమండ్రి సీటు విషయంలో సామాజిక సమీకరణలు కుదరకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. అయితే గుంటూరు ఈస్ట్ పరిస్థితి వేరు..అక్కడ ప్రస్తుతం సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై టీడీపీలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గత కొంతకాలంగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంపై అలీ కన్నేశారు.ఈ క్రమంలో చంద్రబాబు ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఇక మిగిలిన ఆప్షన్ టీడీపీయే...
తొలుత ఆయన వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఓ సందర్భంలో వైఎస్ జగన్ ను కలవడంతో ఆ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చాయి. అయితే మీడియా సమావేశంలో అలీ దీన్ని ఖండించారు. అలాగే ఆయన జనసేన విషయంలోనూ అలీ క్లారిటీ ఇచ్చారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అనే వ్యాఖ్యలు చేసి ఆ పార్టీలో చేరేది లేదని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అయితే టీడీపీ విషయంలో వస్తున్న వార్తలను అలీ ఇప్పటి వరకు ఖండించకపోవడం గమనార్హం. పైగా రెండోసారి ఆయన సీఎం చంద్రబాబును కలవడంతో ..అలీ టీడీపీలో చేరడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. అలాగే అలీ ఆశిస్తున్న సీటు లభిస్తుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.