నిజంగా టీడీపీ ఎమ్మెల్యేలు జగన్తో టచ్ లో ఉన్నారా ?
ఏపీలో పార్టీ ఫిరాయింపులపై అంశం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఏపీ అసెంబ్లీలో ఈ రోజు సీఎం జగన్... పార్టీ ఫిరాయింపు అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..మరో ఐదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో ఫిరాయింపులను ప్రోత్సహించే ఆలోచన తనకు లేదని..ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో పాలన సరైన రీతిలో సాగుతుందని తాను విశ్వసిస్తున్నానని పార్టీ ఫిరాయింపులపైతన వైఖరి స్పష్టం చేశారు. జగన్ తన పార్టీలో వారిని తీసుకుంటారా లేదా అనే అటుంచితే .. ఇంతకీ టచ్ లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా జగన్ నోటి నుంచి ఈ స్టేట్ మెంట్ రావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుంది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయంగా మారింది.
ఔను..ఇది నిజమే !!!
పార్టీ ఫిరాయింపుల అంశంపై ఓ టీవీ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తమకు టీడీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారని చర్చకు తెరదీశారు. మరో అడుగు వేసి స్వయంగా తనకు ఇద్దురు ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీకి భవిష్యత్ లేదని నిర్ణయించుకొని ఆయా ఎమ్మెల్యేలు భావిస్తున్నారని కోటంరెడ్డి అభిప్రాయపడ్డారు. తమను పార్టీలోకి చేర్చుకంటే చాలని.. ప్రస్తుతానికి తమకు ఎలాంటి పదవులు అక్కల్లేదని.. అధినేత గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీని వీడతామని చెప్పినట్లు కొందరు ఎమ్మెల్యేలు వర్తమానం పంపినట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
కాదు ..ఇది పచ్చి అబద్ధం !!
వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటుగా స్పందించారు. వైసీపీ వారు చెబుతున్నట్లు టీడీపీని వీడేందుకు తమ ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. వైసీపీ వారు చెప్పింది నిజమైతే..దమ్మంటే ఆ పేర్లను బయటపెట్టాలని సవాల్ విసిరారు. గతంలో వైసీపీకి చెందిన 23 ముంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో ఎందుకు చేరారన్న విషయాన్ని జగన్ ఆలోచించుకోకుండా ...ఆ ఎమ్మెల్యేలను తాము కొనుగోలు చేశామని సభలో ఆరోపించడం సరైంది కాదని హితవు పలికారు. కేసీఆర్ తరహా సావాసం చేసేందుకు జగన్ కూడా ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారేమోనని అని అనుమానాన్ని వ్యక్తం చేశారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి.
ఏమైనా జరగవచ్చు..!!
తాజా పరిణామంపై విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. వైసీపీ నేతలు పేర్కొంటున్నట్లు జరిగితే తెలుగుదేశం పార్టీప్రతిపక్ష హోదా కోల్పోతుందని.. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పటికీ జగన్ వారిని తీసుకునే పరిస్థితి లేనందున పార్టీ సభ్యుత్వంతో పాటు ఎమ్మెల్యేల పదవి రాజీనామా చేసి బయటికి వచ్చే అవకాశముందంటున్నారు.. ఫలితంగా ఏపీలో ఉప ఎన్నికలు వస్తాయని జోస్యం చెబుతున్నారు. మరికొందరైతే ఇవి ఊహాజనిత ఆరోపణలు అని టీడీపీని ఆత్మ రక్షణలోకి నెట్టేందుకు వైసీపీ వారు రకంగా ఎదురు దాడి చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.