ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌  చెప్పినట్లుగానే ఒకరోజు దీక్ష చేపట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నిరాహార దీక్ష చేపట్టారు. 17 డిమాండ్లతో పవన్‌ చేపట్టిన దీక్ష శనివారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించనున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


శనివారం ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఆయన ప్రజల మధ్య దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలకు నిరాహార దీక్షను ముగించనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురంలోనే పవన్‌ దీక్ష ప్రారంభించారు.



 


అటు పవన్‌ దీక్షకు మద్దతుగా జిల్లా కేంద్రాలు, విజయవాడ నగరంలో జనసేన కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. పూర్తి శాంతియుతంగా జరిగే ఈ దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, ఉద్దానం ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన కోరింది.


ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి 48 గంటలలో ఆరోగ్యశాఖ మంత్రిని నియమించి, కిడ్నీ వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో తాను ఒక రోజు నిరాహార దీక్ష చేపడతానని పలాసలో పవన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే.


కాగా పవన్‌ కల్యాణ్‌ తాను మూడురోజులుగా ఉంటున్న రిసార్టులో శుక్రవారం సాయంత్రం దీక్ష చేపట్టినట్లు తెలియడంతో పెద్దసంఖ్యలో అక్కడకు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. వారందరితో ఆయన కరచాలనం చేసి కృతజ్ఞతలు తెలిపారు.


భారీ బందోబస్తు


శనివారం శ్రీకాకుళం పట్టణంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొననున్న నిరాహారదీక్ష శిబిరం వద్ద భారీఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు శ్రీకాకుళం డిఎస్‌పి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.