Janasena vs TDP : పవన్ పై మంద కృష్ణ మాదిగ సీరియస్, మందకృష్ణ వెనుక చంద్రబాబు ఉన్నారా..?!
Janasena vs TDP: ఏపీ కూటమిలో ఏం జరుగుతుంది..? టీడీపీ, జనసేన మధ్య ఏదైనా గ్యాప్ ఉందా..? జనసేనాని పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ పై చేసిన కామెంట్స్ టీడీపీలో కాక రేపాయా..? పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా టీడీపీ మంద కృష్ణను ప్రయోగించిందా..? పవన్ సొంత ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేశారు..? చంద్రబాబును కలిసిన తర్వాత మంద కృష్ణ పవన్ పై ఎందుకు ఫైర్ అయ్యారు..? కూటమిలో పైకి అంతా బాగానే కనిపిస్తున్నా లోలోన మంటలు చెలరేగుతున్నాయా..?
Janasena vs TDP: ఏపీలో గత రెండు మూడు రోజులుగా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పిఠాపురంలో పవన్ కామెంట్స్ తరువాత ఏపీలో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. అసలు పవన్ కళ్యాణ్ సొంత ప్రభుత్వంపైనే ఉన్నట్లుండి ఇలా తీవ్ర విమర్శలు చేయడంపైనా సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతుంది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో నెలకొన్న శాంతి భధ్రత సమస్యలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శాంతి భధ్రతల విషయంలో రాష్ట్ర హోంశాఖ పూర్తిగా విఫలమైందని బహిరంగంగానే ప్రకటించారు.దీంతో కూటమిలో పెద్ద కలకలం రేగింది. సాక్షాత్తు ప్రభుత్వంలో నెంబర్ టు గా ఉన్న పవన్ ఇలా రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ పై ఇలా మాట్లాడట సంచలనం రేపుతుంది. అంతే కాదు హోంశాఖ మంత్రి దీనికి భాధ్యత వహించాలని అనడం కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఇది ఇలా ఉంటే ఎన్నికల ముందు నుంచి మొన్నటి వరకు చంద్రబాబు, పవన్ మధ్య మంచి దోస్తీ ఉంది. ఏ విషయంలోనైనా కలిసి ప్రకటించేవారు. కానీ ఈ మధ్య ఈ ఇరువురి నేతల మధ్య ఏదైనా కాస్తా గ్యాప్ వచ్చినట్లు కనపడుతుంది. ముఖ్యంగా మద్యం టెండర్లు,టీటీడీ బోర్డు మెంబర్లు, పోలీస్ బదిలీల విషయంలో పవన్ కాస్తా నారాజ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది అనేది జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ప్రభుత్వంలో తాము కూడా కీలకం ఐనా తమ మాట చెల్లుబాటు కావడం లేదని జనసైనికులు పవన్ దృష్టికి తెస్తున్నారట. పదవుల విషయంలోను, టెండర్ల విషయంలోనే తమ కన్నా ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతల హవానే నడుస్తుందని జనసేన నేతలు పవన్ దృష్టికి తెచ్చారట. ఇటీవల మద్యం టెండర్లలో కూడా టీడీపీ నేతల హవానే తప్పా తమకు ఒరిగిందేమీ లేదనేది జనసైనికుల ఆవేదన.తమ అధినేత పవన్ జిల్లాలో పర్యటిస్తుంటే పోలీసులు భధ్రత విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
దీనికి తోడు టీటీడీ బోర్డు మెంబర్ల విషయంలో చాలా హర్ట్ అయ్యారట.ఇటీవలే తిరుమల లడ్డు విషయంలో పెద్ద దుమారం చెలరేగిన నేపథ్యంలో పవన్ టీటీడీ బోర్డు ఏర్పాటులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అనుకున్నారట. అంతే కాదు టీటీడీ ఛైర్మన్ గా రాజకీయాలకు అతీతంగా , సనాతన ధర్మాన్ని పాటించే వివాద రహితుడిని టీటీడీ ఛైర్మన్ గా ఎంపిక చేస్తే బాగుండని పవన్ చెప్పారట కానీ తీరా బీఆర్ నాయుడికి కట్టబెట్టడం బోర్డులోని కొందరి సభ్యుల నేపథ్యం కూడా బాగాలేదనేది పవన్ వాదన. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కలత చెందారని జనసేనలో టాక్. మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వంలో నెంబర్ టు గా ఉన్న తమ నేతకు పోలీసులు సరైన భధ్రత కల్పించడం లేదనే భావనలో జనసేన ఉంది. వీటి అన్నింటి దృష్ట్యానే పవన్ అలా సొంత ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారని జనసేనలో జరుగుతున్న చర్చ.
మరోవైపు పవన్ అలా అనడానికి కారణాలు ఏంటనే దానిపై టీడీపీలో తీవ్ర చర్చ జరగుతుంది. అంటే పవన్ ఉద్దేశపూర్వకంగానే అలా అన్నారా లేక యాదృశ్చికంగా అన్నారా అని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. అంతే కాదు పవన్ కామెంట్స్ అనితను ఉద్దేశించినవి కాదని దాని వెనుక వేరే కథ ఉందని మరి కొందరి వాదన. ప్రభుత్వ అధినేతను అనలేక అనితను అన్నారా అన్న కోణంలో టీడీపీలో చర్చ జరగుతుంది. పవన్ వ్యాఖ్యలపైనా టీడీపీ శ్రేణులు లోలోన రగిలిపోతున్నాయి. అసలు పవన్ కు పరిపాలన అనుభవం లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉండి ఇలా పవన్ బహిరంగంగా ప్రభుత్వంపై కామెంట్స్ చేయడం ఎంత వరకు సమంజసం అని టీడీపీ అంటోంది.
ఇది ఇలా ఉండగానే సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై జనసేన శ్రేణులు సీరియస్ అవుతున్నాయి. చంద్రబాబు నేరుగా అనలేక ఇలా మంద కృష్ణతో ఇలా విమర్శలు చేయిస్తున్నారా అని జనసైనికులు అనుకుంటున్నారు. పవన్ ను ఎస్సీ వర్గాల నుంచి దూరం చేసేలా మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలు చేశారన్నది జనసేన నేతలు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో కూటమిలో అధికారంలో ఉందంటే దానికి కారణం తమ అధినేత జనసేనా అన్న సంగతి టీడీపీ పెద్దలు మరిచిపోతున్నట్లున్నారని జనసైనికులు చురకులు అంటిస్తున్నారు. మరో అడుగు ముందకు వేసి తమ నేత లేక పోతే ఈ రోజు వారికి ఆ పదవులు కూడా వచ్చేవి కాదనేది జనసైనికుల భావన. ఇలాంటి తరుణంలో తమ నేతను కార్నర్ చేసేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే చాలా భరించామని ఇక నుంచి అలా కుదరదని జనసేన గట్టిగా అంటోంది. తమ అధినేతను చిన్న చూపు చూసేలా వ్యవహరించే వాళ్లు ఎంత పెద్ద వారైనా వదిలేది లేదంటున్నారు.
ఇలా పచ్చటి కూటమిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరూ అనుకుంటున్నారు. పవన్ కామెంట్స్ తరువాత పైకి గంభీరంగా కనిపిస్తున్నా రెండు పార్టీల్లో తెలియని అలజడి కనిపిస్తుంది. ఎవరికి వారు తమ వాదనను సమర్థించుకుంటునప్పటికీ..ఇది భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కూటమిలో నెలకొన్ని సమస్యలపై ఇరు పార్టీల అధినేతలు మాట్లాడుకొని దీనికి పులిస్టాప్ పెట్టాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను ఆసరా చేసుకొని కొందరు కూటమిలో చిచ్చు పెట్టే అవకాశం ఉందని అలాంటి అవకాశంను చంద్రబాబు, పవన్ ఇవ్వకూడదు అని సీనియర్లు అంటున్నారు.
మొత్తానికి టీడీపీ,జనసేనలో కొనసాగుతున్న ప్రస్తుత పరిణామాలు టీ కప్పులో తుఫాన్ అవుతుందా లేక రెండు పార్టీల మధ్య మరింత అగాధాన్ని పెంచుతుందా అనేది మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.