కడప: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఘాటు విమర్శలకు పెట్టింది పేరనే సంగతి తెలిసిందే. ఇటీవలే అమరావతి రాజధాని మార్పు విషయమై స్పందిస్తూ.. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నా.. ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన మావాడేనని.. మావోడేం తెలివితక్కువోడేం కాదని వ్యాఖ్యానించి వార్తల్లోకెక్కిన జేసి దివాకర్ రెడ్డి.. తాజాగా శనివారం నాడు ఏపీలో బీజేపి ప్రభంజనంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైందని.. అయితే ఆ ప్రభంజనం ఎక్కువైనా కావచ్చు.. లేదా తక్కువైనా కావచ్చనని జేసీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇందులో ప్రతిపక్ష నేత చంద్రబాబు పరోక్షపాత్ర కూడా ఉందని మరో బాంబు పేల్చిన జేసి.. చంద్రబాబు ఆలోచనలపైనే రాష్ట్రంలో బీజేపీ కూడా ఆధారపడి ఉందని అన్నారు. ప్రధాని మోదీ ఆలోచనలపై ప్రాంతీయ పార్టీలు సైతం ఆధారపడి ఉన్నాయని వ్యాఖ్యానించిన జేసి దివాకర్ రెడ్డి... జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.


జేసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని పరిశీలిస్తే.. ఆయన బీజేపిలో చేరే ఆలోచనలో ఉన్నారా అని రాజకీయవర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపికి, బీజేపికి మధ్య పూర్తిగా చెడిన ప్రస్తుత నేపథ్యంలో జేసి చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ రెండు పార్టీ నేతలు ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.