ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్న వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. వైఎస్సార్సీ ఎంపీలు తమ సవాల్ స్వీకరిస్తే, లోక్ సభ సభ్వత్వానికి రాజీనామా చేసేందుకు తాము సిద్ధంగా వున్నామని జేసీ స్పష్టం చేశారు. ఆ తర్వాత అందరం కలిసి ప్రజల్లోకి వెళ్దామని జేసీ తేల్చిచెప్పారు. అయితే, కేంద్రం నుంచి బయటికొచ్చిన టీడీపీ తర్వాత ఎవరితో జత కడుతుంది ? ఏ ఫ్రంట్ వైపు మొగ్గు చూపుతుందని విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. '' కేంద్రంతో తలాక్ అయిపోయింది. ఏ ఫ్రంట్ వైపు వెళ్లాల్సిన అవసరం తమకు లేదు" అని జేసీ తెలిపారు. 


అనంతరం ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌తో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం కానీ ఇంకేవీ కావు అని అన్నారు. కేంద్ర కేబినెట్ లోంచి బయటికొచ్చినంత మాత్రాన్నే కేంద్రంతో ఏమీ మాట్లాడకూడదనే నిబంధన ఎక్కడా లేదు. అన్నింటికిమించి కేంద్రంతో తమకు శత్రుత్వం కూడా ఏమీ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇకపై ఎంపీ హోదాలోనే కేంద్రంతో చర్చిస్తామని అన్నారు.