తిరుమలలో అపచారం.. కారులో మద్యం, మాంసం స్వాధీనం
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం అని తెలిసి కూడా ఓ జర్నలిస్ట్ తన కారులో మద్యాన్ని, మాంసాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అలిపిరి టోల్‌గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్‌వో ప్రభాకర్ మీడియాకు తెలిపారు.
తిరుమల : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం అని తెలిసి కూడా ఓ జర్నలిస్ట్ తన కారులో మద్యాన్ని, మాంసాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అలిపిరి టోల్‌గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్‌వో ప్రభాకర్ మీడియాకు తెలిపారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. నిషేధిత పదార్థాలను తిరుమలకు తీసుకెళ్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ నిందితుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని ఒక న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న వీడియో జర్నలిస్ట్ ఎన్.వెంకటమునిగా గుర్తించారు. వెంకట ముని తన కారులో తిరుపతి నుండి తిరుమలకు వెళ్తుండగా అలిపిరి టోల్‌గేట్ వద్ద భద్రతా సిబ్బంది జరిపిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
కారులో ముందు సీటు కింది భాగంలో 5 కిలోల చికెన్, 4 బాటిళ్ల సిగ్నేచర్ విస్కీ, 2 బాటిళ్ల ఓడ్కా, 2000 ఎంఎల్ లూజ్ లిక్కర్‌ను తీసుకెళ్తూ పట్టుబడిన వెంకటమునిని భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగించారు. టీటీడీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో వెంకటమునిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి కారును, కారులోని నిషేధిత ఆహారపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనే వెంకటమునిపై నమోదైన ఒక కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఇదిలావుండగానే అతడు మళ్లీ ఇలా పోలీసులకు చిక్కడం గమనార్హం.