కర్నూలు: కర్నూలు ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల నియోజకవర్గం) ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు శుక్రవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.  దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఎన్నికయినట్లు రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మరియు ఇతర సీనియర్ టీడీపీ నాయకులతో ప్రభాకర్ జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి మధ్యాహ్నం వచ్చారు. రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎన్నికల సర్టిఫికేట్ పొందారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగష్టులో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెసులో చేరిన శిల్ప చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పుకోవడంతో ఈ ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది.  వైయస్సార్ సీపీకి చెందిన గౌరు వెంకటరెడ్డిపై టిడిపీ టిక్కెట్ పై  ఆయన ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ సీపీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. 


ఎంపీటీసీల అసోసియేషన్ ప్రెసిడెంట్ జయప్రకాష్ రెడ్డి మరియు పి.నాగిరెడ్డిలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ప్రవేశించారు. కాని వారు అనూహ్యంగా నామేమినేషన్లను ఉపసంహరించుకొని పోటీ నుండి వైదొలిగారు. వారు వైదొలిగేలా కేఈ కృష్ణమూర్తి చక్రంతిప్పినట్లు సమాచారం. ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఎన్నికయినందున టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ..  స్వీట్లు పంపిణీ  చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభాకర్ ఎన్నికపట్ల హర్షం వ్యక్తం చేశారు.