తలపై టీవీ పడి ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి మృతిచెందిన దుర్ఘటన కర్నూలు జిల్లా పాములపాడులో చోటు చేసుకుంది. పాములపాడుకి చెందిన లింగారెడ్డి, అంజలి దంపతులకు ముగ్గురు కూతుళ్లు కాగా వీరిలో చిన్న కూతురు వెంకటసింధు మంగళవారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ, ఆడుకుంటూ టీవీ స్టాండ్‌ వద్దకు వెళ్లి టీవీ స్టాండ్‌ను పట్టుకుని ముందుకు లాగింది. టీవీ స్టాండ్‌కు చక్రాలు ఉండటంతో స్టాండ్ ముందుకు కదలడం, ఆ వెంటనే స్టాండ్‌పై ఉన్న టీవీ చిన్నారి తలపై పడటం వెనువెంటనే జరిగిపోయాయి. 


ఇంట్లో ఏదో పేలిన శబ్దం రావడంతో ఇంటి బయట పనిలో నిమగ్నమైన తల్లి అంజలి వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా చిన్నారి తలపై టీవీ పడి ఉంది. వెంటనే టీవీని పక్కకు తొలగించి చూడగా అప్పటికే తలపై టీవీ పడిన గాయంతో కొంత అపస్మారక స్థితిలోకి వెళ్లిన చిన్నారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే, దురదృష్టవశాత్తు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు స్పష్టంచేశారు. తమ గారాలపట్టి వెంకటసింధు అకాల మృతి ఆ తల్లిదండ్రుల తీరని ఆవేదనను మిగిల్చింది.