ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర : కేటీఆర్
ఏపీ, జాతీయ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన అనంతరం శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఏపీలో రాజకీయ పార్టీల గెలుపు, ఓటములు, చంద్రబాబు చేస్తోన్న జాతీయ రాజకీయాలు, టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఫ్రంట్ పేరుతో హడావుడి చేస్తున్నారే తప్ప అంతకుమించి ఇంకా ఏమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర తప్పనిసరిగా ఉంటుందన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. ఆంధ్రాలో బలమైన ప్రాంతీయ పార్టీ గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పిన కేటీఆర్.. భవిష్యత్‌లో జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలే ప్రత్యామ్నాయం కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు జాతీయ రాజకీయాల గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక మంచి ప్రయత్నం కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తోంటే.. చంద్రబాబు మాత్రం బీజేపీని బూచిగా చూపి తమ టీడీపీని బలపర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో.. చంద్రబాబు జాతీయ స్థాయి నాయకుడు కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కాంగ్రెస్ వైపు ఉన్నారని.. అయితే కాంగ్రెస్, బీజేపీలతో సంబంధం లేనటువంటి ఫ్రంట్ కోసం టీఆర్ఎస్ కృషి చేస్తోందని కేటీఆర్ స్పష్టంచేశారు.