నారా లోకేష్ పోటీ చేసే స్థానం దాదాపు ఖరారైంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం రాజధాని ప్రాంతమైన మంగళరిగి అసెంబ్లీ స్థానం నుంచి లోకేష్ బరిలోకి దిగుతున్నారు. లోకేష్ పోటీపై సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా నారా లోకేష్ అభ్యర్దితత్వానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. 


నారా లోకేష్ పోటీపై పార్టీలో ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. తొలుత లోకేష్  చిత్తూరు జిల్లా కుప్పం, కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.  ఇదే క్రమంలో భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి  పోటీ చేస్తారంటూ మరోరకమైన ప్రచారం జరిగింది. లోకేష్‌ను రాజధాని ప్రాంతం నుంచి పోటీ చేయించాలంటూ అధికశాతం పార్టీ శ్రేణులు కోరడంతోనే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.