ఏపీ ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ వారం రోజుల పాటు చైనా అధికారిక ప‌ర్యట‌న‌కు వెళ్లారు. శనివారం హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి చైనా బయల్దేరి వెళ్లారు. లోకేశ్‌తో పాటు ఈడీబీ సీఈవో కృష్ణకిషోర్‌, ఐటీ కార్యదర్శి విజయానంద్‌, ఇతర ఉన్నతాధికారులు చైనా వెళ్లారు. ఎలక్ర్టానిక్‌ దిగ్గజ కంపెనీలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోవాలన్నది ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం.. చైనా అధికారిక పర్యటనలో టియాంజిన్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో మంత్రి నారా లోకేష్‌ పాల్గొని ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను లోకేశ్ వివరించనున్నారు. కాగా.. భారతదేశం త‌ర‌ఫున మంత్రి నారా లోకేశ్‌కు మాత్రమే ఈ అవ‌కాశం లభించడం గమనార్హం.  


చైనా పర్యటనలో లోకేష్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనడంతో పాటు...పలు ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులను కలవనున్నారని తెలిసింది. అంతేకాకుండా కొన్ని మన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకోనున్నరని సమాచారం.పర్యటనలో భాగంగా.. అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల సీఈఓలతో, ప్రతినిధులతో మంత్రి లోకేశ్ స‌మావేశంకానున్నారు. ఒకేచోట లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే మెగా ఫ్యాక్టరీ దిశగా పెట్టుబడులు తేవాలన్నది తన లక్ష్యంగా మంత్రి లోకేశ్‌ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనాలోని షెంజెన్‌ నగరం ఇలాంటి మెగా ప్రాజెక్టులకు ప్రసిద్ధి. ఆ నగరంలో లోకేశ్‌ పర్యటించనున్నారు.