రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం రూపొందించిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సోమవారం ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని ఉండవల్లిలోని ప్రజావేదికలో ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో జిల్లాకేంద్రాల్లో, 175 నియోజకవర్గ కేంద్రాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ (సోమవారం).. ఇప్పటి వరకు యువనేస్తం పథకానికి 2.10 లక్షల మంది అర్హత సాధించారని.. వీరందరికీ ఈనెల నుంచి నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు. 'అర్హులలో 1.86 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం రూ.1 జమ చేసింది. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తలేదు. బ్యాంకులకు మంగళవారం సెలవు కావడంతో అర్హులకు బుధ, గురువారాల్లో మిగిలిన 999 రూపాయలను భృతిని జమ చేస్తాము.' అని లోకేశ్‌ వివరించారు. ఇకపై అర్హుల ఎంపికకు ప్రభుత్వం ప్రతి నెలా 25న కటాఫ్‌గా నిర్ణయించింది.  


పథకానికి అర్హత పొంది, చివర్లో అప్లయ్‌ బటన్‌ క్లిక్‌ చేయనివారికీ నిరుద్యోగ భృతి వర్తింపజేయనున్నారు. దీంతో మరో 20వేల మంది నిరుద్యోగ భృతికి  అర్హత సాధించారు.


ఈ పథకం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అధికారులతో సమీక్షించారు. నిరుద్యోగ భృతిని బుధవారంలోగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం ఆదేశించారు. లబ్ధిదారులకు భృతి రూ.వెయ్యితోపాటు శిక్షణ సమయంలో అదనంగా రూ.1500 ప్రోత్సాహకంగా ఇచ్చేందుకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్థి శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమీక్ష సందర్భంగా గతంలో ఉన్న నిబంధనను ఒక దానికి మినహాయింపు ఇచ్చారు. రెండున్నర ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమి కలవారు నిరుద్యోగ భృతికి అనర్హులని గతంలో ఉన్న నిబంధనను సడలించడం జరిగింది.


నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ : నారా లోకేశ్‌


నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రితో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి పొందే వారంతా ప్రతి నెల మీసేవా కేంద్రాలలో బయోమెట్రిక్‌ ద్వారా వారు రాష్ట్రంలోనే ఉన్నట్టుగా ధృవీకరణ చేయించుకోవాలన్నారు. మంగళవారం ధృవీకరణ పత్రాలు పొందే వారు వెంట ఫోటో ఐడీ కార్డు, ఆధార్‌ లేదా రేషన్‌ కార్డును తీసుకురావాలని సూచించారు. రాష్ట్రానికి పలు కంపెనీలు రానున్నాయన్న ఆయన.. 30 లక్షల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని వెల్లడించారు.