దేశ వాణిజ్య రాజధానిగా నగరంగా పేరుగాంచిన ముంబాయి మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు సియాన్, థానే, చెంబూరుతో పాటు పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ముంబాయి మున్సిపాలిటీ సిబ్బంది రంగంలోకి దిగింది. పలుచోట్ల భారీ పంపులతో నీటిని తోడుతున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


వర్షాల కారణంగా సబర్బన్‌తో పాటు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.  విమానాలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. శాంతాక్రజ్ ప్రాంతంలో 195 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.



 



 


గాలివానకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో కరెంట్ తీసేశారు. దీంతో ఆ ప్రాంతాలన్నీ అంధకారంలోనే ఉన్నాయి. మరోవైపు వర్షాల కారణంగా ఎంజీరోడ్డులో చెట్టు కూలి ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి.



 


నేడు తెలంగాణలో మోస్తరు వర్షాలు


రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోని కొన్ని చోట్ల, కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.