వైఎస్సార్ పాత్రలో నాగార్జున ఓ సినిమా చేయనున్నాడనే టాక్ ఇవాళ కొత్తది కాదు. కాకపోతే ఆ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కిన దాఖలాలు లేవు. అయితే, 2019 ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో దివంగత వైఎస్సార్ పాలన, ఆయన ఆశయాలు, ప్రజాసేవ గురించి ప్రజలకు తెలియచెప్పాలని భావిస్తున్న వైఎస్సార్సీపీ.. అందుకు వైఎస్సార్ బయోపిక్‌ని తెరకెక్కించేందుకు ఇదే సరైన సమయం అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో భాగంగా వైఎస్సార్‌కి దగ్గరిపోలికలు వున్న నటుడు, సౌతిండియాలో అన్ని భాషల ఆడియెన్స్‌కి సుపరిచితుడైన మమ్ముట్టిని ఆ పాత్ర కోసం ఎంచుకోవాలని మేకర్స్ అనుకున్నారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఇతర భాషల్లోకన్నా తెలుగు భాషలో ఈ సినిమా సక్సెస్ ముఖ్యం అనే ఉద్దేశంతో మేకర్స్ నాగ్‌ని సంప్రదించడం, అందుకు ఆయన కూడా ఓకే చెప్పడం జరిగిపోయాయని ఫిలిం నగర్ టాక్. కాకపోతే నాగ్ ఈ సినిమా చేయడానికి ఓ షరతు విధించాడట. అదేమంటే.. ఈ సినిమాను 2019 ఎన్నికల కన్నా ముందుగా రిలీజ్ చేయకూడదు అని. 


ఒకవేళ 2019 ఎన్నికల కన్నా ముందుగా వైఎస్సార్ బయోపిక్ విడుదల అయితే, ఆ సినిమా ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందనేది నాగ్ భయమని, అందుకే ఎన్నికల తర్వాత విడుదల చేసే ఉద్దేశం ఉన్నట్టయితేనే తాను ఈ సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తాను అని నాగ్ చెప్పినట్టు సినీవర్గాల్లో ఓ ప్రచారం జరుగుతోంది. యువ దర్శకుడు మహీ వీ రాఘవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని మీడియాలోనూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రచారంలో ఎంతమేరకు నిజం వుందనేది అటు వైఎస్సార్సీపీ నుంచి కానీ లేదా ఇటు నాగ్ వైపు నుంచి కానీ ఎవరైనా అధికారికంగా స్పందిస్తే కానీ తెలియదు.