ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణు మాధవ్ అనారోగ్యంతో మృతి
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, స్వరబ్రహ్మగా పేరొందిన పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ ఇక లేరు
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, స్వరబ్రహ్మగా పేరొందిన పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. తెలుగునాట మిమిక్రీ ఆర్టిస్టులు అంతగా లేని ఆ రోజుల్లోనే తనదైన శైలిలో, సొంత ఒరవడితో మిమిక్రీ చేసి ఆకట్టుకుని స్వరబ్రహ్మగా పిలిపించుకున్న గొప్ప కళాకారుడు వేణుమాధవ్. కళారంగానికి ఆయన చేసిన సేవలకుగాను గుర్తింపుగా 2001లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఇటీవలే ప్రభుత్వం వేణుమాధవ్ పేరుతో పోస్టల్ స్టాంప్ విడుదల చేసి, ఆయనపై గౌరవాన్ని చాటుకుంది. వేణుమాధవ్ మృతిపై పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ జానీ లివర్ లాంటి వాళ్లు ఆరోజుల్లో వేణుమాధవ్ వద్ద స్పూర్తి పొందిన వాళ్లే కావడం విశేషం.