NTR JAYANTHI: నందమూరి తారకరామారావు.. ఈ పేరు తెలుగు ప్రజలకు ఓ వైబ్రేషన్. ఎన్టీఆర్ పేరు వింటే కోట్లాది మంది పులకించిపోతారు. పేదలు చేతులు పైకెత్తి కొలుస్తారు. 33 ఏళ్ల సినిమా జీవితంలో ఎదురులేని హీరోగా నిలిచారు తారకరాముడు. 13 ఏళ్ల రాజకీయ గమనంలోనూ ఎవరికి అందనత్త ఎత్తుకు ఎదిగిపోయారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని చివరివరకు ఆచరించి చూపించారు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న మాటను నిజం చేస్తూ జనం గుండెల్లో నిలిచారు. అంతటి మహానేత శత జయంతి సందర్బంగా ఆయనకు తెలుగు ప్రజలు ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవోడీ చరిత్రకు సంబంధించి కీలక విషయాలు మీకోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు ప్రజలు యుగపురుషుడిగా భావించే నందమూరి తారకరామారావు.. 1923 మే 28న ఏపీలోని  కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. 1942 మేలో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని వివాహం చేసుకున్నారు. తొలి సంతానం కలిగిన తర్వాత రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. కానీ ఆ ఉద్యోగం నచ్చక తనకు ఇష్టమైన సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లారు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో నటించారు ఎన్టీఆర్. వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రేక్షకులను మెప్పించారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలలో అద్భుతంగా నటించారు. రాముడిని తారకరాముడిలో చూసుకున్నామని జనాలు చెప్పుకున్నారంటే.. ఆ పాత్రలో ఆయన ఎంతగా ఒదిగిపోయారే ఊహించవచ్చు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు ఎన్టీఆర్. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు.


తన అద్బుత నటనతో విశ్వవిఖ్యాత నటుడిగా నిలిచిన ఎన్టీఆర్.. 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన  తెలుగు దేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు.  ‘ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుంచి వచ్చింది. కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.. ఆశీర్వదించండి.. అంటూ నినదించారు. ఎన్టీవోడి ఆ పిలుపే జన ప్రభంజనమైంది. చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగారు ఎన్టీఆర్. ఆయన ప్రసంగాలు జనాలను ఉత్తేజపరిచాయి. అన్నగారితో కలిసి నడిచేందుకు వందలు.. వేలు.. లక్షలాదిగా జనం పోటెత్తారు. ఆయనకు నీరాజనం పట్టారు. దీంతో పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించి అధికారంలోకి వచ్చారు. దేశ రాజకీయాల్లో పెను సంచలనమయ్యారు. మూడు సార్లు గెలిచిన ఎన్టీఆర్.. 7 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా ఆయనదే రికార్డ్.


ఆంధ్రప్రదేశ్ కు తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్టీఆర్.. వెంటనే తాను ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ చేశారు. అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పేదల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. కూడి, గూడి, గుడ్డ ఆశయంతో పాలన సాగించారు తారక రామారావు. రెండు రూపాయల కిలో బియ్యం, ఇళ్ల నిర్మాణ పథకాలు చేపట్టారు. పేదలకు ఉచితంగా దుస్తులు పంపిణి చేశారు. ఈ పథకాలు పేదలకు వరంగా మారాయి. అవే ఎన్టీఆర్ ను పేదల గుండెల్లో దేవుడిగా నిలిపాయి.ప్రభుత్వ ఖజానాకు భారమైనా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసి చూపించారు. అవే ఆయనకు 1994లో గతంలో ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు దక్కేలా చేశాయి. 1984లో సినిమారంగంలో స్లాబ్ విధానాన్ని అమలుపరిచారు. ఆరో వేలుతో సమానమంటూ 1985 జూన్ 1న  శాసనమండలిని రద్దు చేశారు. హైదరాబాదు లోని ట్యాంకుబండ్ పై తెలుగు ప్రముఖుల విగ్రహాలు నెలకొల్పారు. తర్వాత ఆ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మారింది. హైదరాబాద్ కు తలమానికంగా నిలిచింది.    


ఎన్టీఆర్ సినిమా జీవితం సాఫీగా సాగినా రాజకీయ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. సీఎంగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ఎన్టీఆర్. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ తగ్గింపు నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. 1984 ఆగష్టు 16న నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. అప్పటి గవర్నరు రాంలాల్ సహకారంతో రామారావును దింపేసి దొడ్డిదారిన అధికారం దక్కించుకున్నారు. దీంతో ఎన్టీఆర్ జనంలోకి వెళ్లారు. ప్రజాఉద్యామనికి జడిసన కేంద్రం సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ కు తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. తర్వాత 1985లో ప్రజా తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్.. 202 స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చారు.1985-89 మధ్య కాలంలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు జనంలో ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే నడిపించడంతో నియంత పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.1989లో  అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మొత్తం మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దు చేసి కొత్త మంత్రుల్ని తీసుకున్నారు ఎన్టీఆర్. ఈ కాలంలో జరిగిన కొన్ని కుల ఘర్షణలు కూడా ఎన్టీఆర్ సర్కార్ ప్రతిష్ఠను దెబ్బతీసాయి. 1989 ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపింది. తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది.


రాష్ట్రంలో ఓడిపోయినా కేంద్రంలో చక్రం తిప్పారు ఎన్టీఆర్. దేశంలోని ప్రాంతీయ పార్టీలను, కమ్యూనిస్టులను ఏకం చేసి,, నేషనల్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేశారు. 1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలో  కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పివీ నరసింహారావు పోటీ చేయగా.. తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 1989-94 మధ్య రాజకీయంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఎన్టీఆర్. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఎన్నో అవమానాలు పడ్డారు. అసెంబ్లీ నుంచి తొమ్మిది సార్లు సస్పెండ్ అయ్యారు ఎన్టీఆర్. ఆ సమయంలోనే రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ నాలుగు సినిమాల్లో నటించారు ఎన్టీఆర్. తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నారు తారకరామారావు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపుగా మారింది. లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత నందమూరి కుటుంబంలో విభేదాలు వచ్చాయి. పార్టీ, ప్రభుత్వ విషయాలలో లక్ష్మిపార్వతి జోక్యం పెరగడం మరింత అగ్గి రాజేసింది. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్యేల అండతో ఎన్టీఆర్ ను గద్దె దింపి ముఖ్యమంత్రి అయ్యారు నారా చంద్రబాబు నాయుడు. తర్వాత 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో చనిపోయారు ఎన్టీఆర్. తెలుగుజాతి చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకత ఎరాను లిఖించుకున్న  నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఆ మహానీయుడుని మనమూ స్మరించుకుందాం..  అమర్ రహే ఎన్టీఆర్...


READ ALSO: NTR Jyanthi: ఎన్టీఆర్‌ ఫోటోతో వంద రూపాయ నాణెం! తారకరాముడికి ఘనంగా నివాళులు


READ ALSO: NTR Centenary Celebrations: ఎన్టీఆర్ కు జూనియర్ నివాళి.. నందమూరి ఫ్యామిలీ ఏకమవుతుందా? మహానాడుకు వెళతారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook