Pawan Kalyan In Independence Day Celebrations: జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి.. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ వీర మహిళలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ఎంతో మంది మహానుభావులు కలిసి రూపొందించారని.. ఎప్పుడు రాజ్యాంగం రూపొందించిన వారిలో మగవారి పేర్లు మాత్రమే వినిపిస్తాయి కానీ మహిళలు కూడా భాగస్వాములు అయ్యారని చెప్పారు. విభజన సమయంలో ఎంతోమంది మహిళలు బాధలు పడ్డారని.. త్యాగాలు చేశారని గుర్తు చేశారు. 15 మంది మహిళలు  రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వామ్యులు అయ్యారని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళలు వంటగదికే పరిమితం కాకూడదని.. తన స్వంత కాళ్ళ మీద నిలబడాలని తాను కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. చట్టసభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ప్రాధాన్యత ఉండాలని అన్నారు. మహిళలు దేశం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తు పెట్టుకోవడం మన ఉనికికి చాలా అవసరం అన్నారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములకు సరైన గౌరవం దక్కలేదని.. ప్రభుత్వాలు ఆయనను విస్మరించాయని అన్నారు. ఆయనను ఒక వర్గానికే పరిమితం చేశాయని.. జనసేన పార్టీ ఇలాంటి మహనీయులను గౌరవించుకుంటుందన్నారు.


"భారత దేశం సంపన్న దేశం. మనం ఎప్పుడు ఏ దేశంపై దండెత్త లేదు. మనపై అన్ని దేశాలు సంపద కోసం దండెత్తి వచ్చాయి. ఏ గొడవలు జరిగినా సరే అని నడుగా ఆడపడుచుల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న మణిపూర్ రాష్ట్రంలో 2 తెగల మధ్య గొడవలో ఒక మహిళను నగ్నంగా ఊరేగించిన దుర్ఘటన జరిగింది. ఇది చాలా బాధాకరం. చరిత్రను మనం గుర్తు ఉంచుకోవాలి. మన రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్‌కు గురైతే కనీసం ఒక్క సమీక్ష జరగలేదు. రాష్ట్రంలో 155 మంది చిన్న పిల్లలు ట్రాఫికింట్‌కు గురయ్యారు. కుల, మతాలకు అతీతంగా మహిళల్లో, పిల్లలకు రక్షణ కల్పిస్తాం. మొన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో తన అక్కను ఏడిపించ వద్దని అడిగినందుకు 14 ఏళ్ల అమర్నాథ్‌ను తగలబెట్టి చంపేసిన దుర్ఘటన జరిగింది. 


నిన్న అనకాపల్లి నియోజకవర్గం విస్సన్నపేట భూములు పరిశీలించడానికి వెళ్తే ఒక మహిళ వచ్చి లెటర్ ఇచ్చింది. తన కొడుకుని చంపేశారు.. స్పందన కార్యక్రమానికి వెళ్ళినా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినా న్యాయం జరగలేదని చెప్పింది.  ఇంకోసారి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి వస్తే.. మేము ఇక్కడ ఉండలేం, వేరే రాష్ట్రాలకి, దేశాలకు పారిపోతాం అని చెప్తున్నారు. ఎక్కడకు వెళతారు..? ఎక్కడకు వెళ్లినా వివక్ష ఉంటుంది. మీరెందుకు మీ నేల విడిచి వెళ్లిపోవాలి..? ఎదురు తిరగాలి కదా..? కొన్ని సంవత్సరాల క్రితం వరంగల్లో స్వప్నిక అనే ఆడబిడ్డ యాసిడ్ దాడికి గురైతే నేను వెళ్తే ఆ బిడ్డ నాతో అన్నమాట నా పరిస్థితి ఇంకొకరికి రాకుండా చూడు అన్నా అని చెప్పింది. ఆయేషా, విజయవాడ శ్రీలక్ష్మి హత్య, సుగాలి ప్రీతి ఇలా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఆపేందుకు ప్రభుత్వాలు ఎందుకు బలంగా పనిచేయడం లేదు. సెక్యులరిజం పేరిట ఇతర మతాలను తిడతాం అంటే కుదరదు. స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించనంత వరకే.. స్త్రీ తలచుకుంటే మార్పు ఖచ్చితంగా వస్తుంది, మీరు బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం.." అని పవన్ కళ్యాణ్ అన్నారు. 


జనసేన పార్టీ అధ్వర్యంలో "ప్రజా కోర్టు" అని సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ చేయనున్నామని ఆయన తెలిపారు. చెత్త మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారని.. అడ్డదిడ్డంగా మాట్లాడితే కూడా ట్యాక్స్ వేస్తామంటే అత్యధిక పన్ను వైసీపీ కట్టాల్సి ఉంటుందని అన్నారు. అక్రమ ఆస్తులు, దోపిడీలపై సమాచారం ఇచ్చేవారికి బహుమతి ఇచ్చే పద్ధతి తీసుకువస్తామన్నారు. దయచేసి  జనసేనకు అండగా నిలబడాలని.. మీ బిడ్డల భవిష్యత్తు కోసం బలంగా పనిచేస్తామని పవన్ కళ్యాణ్‌ అన్నారు.